August 2019

 
عن  عمرَ بنَ الخَطّابِ t المِنْبَرِ قال: سَمعْتُ رَسولَ اللّهِ r يَقولُ «إِنّما الأعْمَالُ بالنّيات, وإِنّمَا لِكُلّ امْرِىءٍ ما نَوَى: فَمَنْ كانتْ هِجْرَتُه إِلى دُنْيَا يُصِيبُها, أَوْ إِلى امْرَأَةٍ يَنْكِحُها, فَهِجْرَتُه إِلى ما هاجَرَ إِلَيه» .           رواه البخاري



ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు  మెంబర్ (మస్జిద్ లోని ప్రసంగ వేదిక) పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రకటనను తాను విన్నానని ఉల్లేఖించారు. 

అనువాదం - “నిశ్చయంగా ఏ పనికైనా దొరికే ప్రతిఫలం తమ మనోసంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే నిశ్చయంగా ఏ ఆజ్ఞకైనా. (దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది) మరియు ఎవరైతే ప్రపంచం కోసం వలస వెళతారో వారికి అదే (ఆ ప్రపంచమే) లభిస్తుంది. ఇంకా ఎవరైతే ఒక స్త్రీని పెళ్ళాడటానికి వలస వెళతారో, వారి వలస ఆ పెళ్ళి కొరకే పరిగణింపబడుతుంది.” సహీ బుఖారి హదీథ్ గ్రంథం.

వివరణ: మక్కానగరపు ఖురైషీ అవిశ్వాసులు ఇస్లాం స్వీకరించిన వారిని అనేక రకాల  అత్యాచారాలకు గురి చేసారు. ఆ బాధల నుండి తప్పించుకోవటానికి అల్లాహ్ ఆజ్ఞలను అనుసరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ముస్లింలను ముందుగా హబ్షా(యుథోపియా)కు తర్వాత మదీనాకు వలస పోవటానికి అనుమతించారు. అప్పుడు అనేక మంది ముస్లింలు మదీనాకు వలస పోయారు. ఇస్లాం కోసం వారు చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా అనేక పుణ్యాలు లభించనున్నట్లు ప్రకటింపబడినది. ఆ సమయంలో ఒకతను తనను వివాహమాడాలంటే మదీనాకు వలస చెయ్యమని షరతు విధించిన ఉమ్మె ఖైస్ అనే మహిళను పెళ్ళాడటానికి మదీనా పట్టణానికి వలస చేసినాడు. అతడికి కూడా పుణ్యాలు లభిస్తాయా లేదా అనే సందేహానికి జవాబుగా పై హదీథ్ ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు. ఈ హదీథ్ ఒక సాధారణ నియమాన్ని బోధిస్తున్నది.అదేమిటంటే ఎవరైనా సరే అతడు పొందే ప్రతిఫలం పూర్తిగా అతడి అసలైన సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది తప్ప ఏ మాత్రం అతడు చేసే పనులపై కాదు. అవి పైకి చాలా మంచి పనులుగా కనబడినా సదుద్దేశ్యంతో కూడినవి కాకపోవచ్చు (లోపల దురుద్ధేశ్యంతో కూడినవై  ఉండవచ్చును).


ఈ హదీథ్ ద్వారా మానవజాతికి కలిగే ప్రయోజనాలు (లాభాలు): 

1.ఇస్లాం లో సంకల్పమే ఏ పనికైనా పునాది వంటిది.
2.కేవలం అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే చిత్తశుద్ధి గల సంకల్పంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చూపిన పద్ధతి ప్రకారం ఏ పనైనా చేసినట్లైతే దానిని అల్లాహ్ తప్పక స్వీకరిస్తాడు.
3.సరైన సంకల్పంతో నిత్యజీవితంలో చేసే ప్రాపంచిక పనులన్నింటికీ  ప్రస్తుత జీవితంలోనూ, చనిపోగానే మొదలయ్యే పరలోక జీవితంలోను ప్రతి ముస్లిం మంచి ప్రతిఫలం పొందుతాడు. ఆ పనులలోని చిత్తశుద్ధి వలన  అవన్నీ అల్లాహ్ కు సమర్పించిన ఆరాధనలుగా లెక్కించబడును. బోధించే టీచరు, చదువుకునే విద్యార్థి, లావాదేవీలు చేసే వ్యాపారస్తుడు - వీరందరూ చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ కోసమే గనుక తమ తమ పనులు చేస్తున్నట్లైతే, నిజంగా వారు అల్లాహ్ ను ఆరాధిస్తున్నట్లే.
4.ఎవరైనా  ముస్లిం మంచి పని చేయాలని సంకల్పం చేసుకుని, ఏవైనా కారణాల వలన పూర్తి చేయలేక పోయినా సంకల్పంలోని చిత్తశుద్ధి ఆధారంగా అతడికి ప్రతిఫలం లభిస్తుంది.
5.అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే నిజమైన సంకల్పం ఈ జీవితంలోను, రాబోయే జీవితంలోను జయప్రదమైన మంచి ఫలితాన్నిస్తుంది.
6.ఇస్లామీయ జీవనవిధానంలోని భాగమైన వుదూ చేయడం (ప్రత్యేక పద్ధతిలో ముఖం, కాళ్ళు చేతులు కడుక్కోవటం),గుసుల్ చేయటం (ప్రత్యేక వద్ధతిలో స్నానం చేయడం),తయమ్మమ్ చేయడం (నీరు దొరకని పరిస్థితిలో లేక అనారోగ్య సమయంలో పరిశుభ్రపరచుకోవడం), నమాజు చేయడం, జకాతు దానం ఇవ్వడం, హజ్ యాత్ర చేయడం, రమదాన్ నెలలోని చివరి పది రోజులు మస్జిద్ ఎతేకాఫ్ అంటే ఏకాంతవాసం చేయడం వంటి అన్ని రకాల ఆరాధనలు సరైన సంకల్పం లేకుండా ఆచరించినట్లైతే వాటిని అల్లాహ్  స్వీకరించడు మరియు ఎటువంటి ప్రతిఫలం లభించదు.
7.ఎంత మంచి పనైనా సరే చెడు సంకల్పంతో చేసినట్లైతే అది స్వీకరింప బడదు. చేసే ప్రతి పని కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చెయ్యాలి - అది జీవిత దినచర్యైనా లేక ఆరాధనకు సంబంధించినదైనా. ఇటువంటి గొప్ప సంకల్పం వలన కలిగే అత్యంత ముఖ్యమైన లాభం అల్లాహ్ కోసమే చేస్తున్నానని నిశ్చయించుకున్నప్పుడు చెడు పనుల నుండి దూరమవటానికి అవకాశమున్నది.  ఇంకా మంచి పనులు చేయటంలో నిర్లక్ష్యం తగ్గుతుంది. 

ఎప్పుడైతే ప్రజలు సర్వలోక సృష్టికర్త యొక్క ఏకదైవారాధనను వదిలి, షిర్క్ (ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం) అనే అంధవిశ్వాసాల్ని, సహేతుకం కాని సిద్ధాంతాల్ని కనుగొన్నారో, అప్పటి నుండి తన భక్తులను కేవలం తనను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించటానికి, ఆరాధనలలో ఇతరులను తనతో జత పరచ వద్దని ఆజ్ఞాపించటానికి మరియు వారిని బహుదైవారాధనపు గాఢాంధకారంలో నుండి ఏకైక దైవారాధనపు వెలుగు లోనికి తీసుకు రావటానికి అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపటం జరిగింది.

ప్రవక్తలందరూ తౌహీద్ (ఏకైక దైవత్వం అంటే మహోన్నతమైన మరియు అత్యంత ప్రశంసనీయమైన అల్లాహ్ యొక్క ఏకైకత్వంలో విశ్వాసం)నే బోధించారు. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి:
“వాస్తవంగా మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము. అతను వారితో ‘ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను’ అని అన్నాడు”(7:59)

“మరియు మేము ఆద్ జాతి వద్దకు, వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను:‘ఓ నా జాతి సోదరులారా! మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమిటీ? మీకు దైవభీతి లేదా?” (7:65) ఇది ఆద్ జాతి కు వచ్చిన ప్రవక్త సందేశం.

“మరియు మేము మద్యన్ జాతి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము) అతను వారితో అన్నాడు: నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చియున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తి నిజాయితీతో ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై శాంతి స్థాపించబడిన తర్వాత మరల కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది” (7:85). ఇది మద్యన్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన ప్రకటన.{మద్యన్ అనేది ఒక తెగ & నగరపు పేరు. వారి వద్దకు షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్త గా  పంపబడ్డారు. మద్యన్ యొక్క  మరొక పేరు అయ్ కహ్. మృత సముద్రానికి తూర్పున, అఖాభా అగాధం నుండి (Gulf of Aqaba) పడమటి వైపు ఉన్న సినాయి ద్వీపకల్పం మరియు మోఆబ్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నది. అక్కడ నివసించే వారు ఆమోరైట్ తెగకు చెందిన అరబ్బులు. షుఐబ్ మరో పేరు ఎత్రో (Jethro)} 

ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము. అతను వారితో:“నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు”(7:73) ఇది సమూద్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు రమ్మని ఆహ్వానించిన ప్రకటన.{సమూద్ ప్రజలు ఆద్ జాతికి చెందిన నబాతియన్ తెగకు చెందిన వారు. రెండవ ఆద్ జాతిగా ప్రసిద్ధి చెందినారు. వారు హిజాజ్ ఉత్తర భాగంలో ఉండేవారు. ఆ ప్రాంతం వాది అల్ ఖురా అనబడుతుంది. వారు ఆ పర్వత ప్రాంతంలో కొండలను తొలిచి గుహలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ సాలెహ్. నేటికీ అవి ఆ పేరుతోనే పిలవబడుతున్నాయి. ఇది మదీనా పట్టణం మరియు తబూక్ పట్టణాల మధ్య ఉన్నది. ఇప్పటికీ వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.}

మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతడన్నాడు): “మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి” (16:36)
అల్లాహ్ ప్రతి ప్రవక్తను ఆయన స్వంత జాతి వద్దకు  వారి మార్గదర్శకత్వం కోసం పంపెను. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొత్తం మానవజాతి మరియు జిన్నాతుల మార్గదర్శతక్వం కోసం పంపెను. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లోని (7:158) వచనం ధృవీకరుస్తున్నది-(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు:“మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను”

“మరియు నేను జిన్నాతులు మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాదించటానికే!” (51:56)

ఇంకా ఖుర్ఆన్ లోని అనేక వచనాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వలన స్పష్టమవుతున్న దేమిటంటే, మానవాళికి మార్గదర్శకత్వపు అవసరం కలిగినప్పుడు,  అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు.

ఇస్లాం ప్రకారం 786 సంఖ్యా శాస్త్రానికి మరియు గణాంకాలకు సంభందించిన సాధారణ సంఖ్య మాత్రమే. అంతే కాని దీనికి వేరే ఎటువంటి ప్రత్యేక ప్రాధాన్యత అంటూ ఏమి లేదు. ఇస్లాంలో 1 వ నంబర్ నుండి 9 వ నంబర్లకు ఎంత ప్రాధాన్యత వుందో అంతే ప్రాధాన్యత ఈ 786 నంబర్ కు కూడా వుంది. కాని కొంత మంది ముస్లింలు ఈ 786 నంబర్ని అల్లాహ్ యొక్క పవిత్ర నామాలైన "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్" గా భావించడం జరుగుతుంది. మరి కొంతమంది ముస్లింలు తమ ఇండ్లలో ఈ నంబర్ ప్లేట్ ని వేలాడదీయటం, అలాగే తమ వాహనాలపై ఈ నంబర్ని అతికించుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం ఖురాన్ మరియు హదీస్ లకు విరుద్ధం, ఎందుకంటే ఈ నంబర్ గురుంచి ఖురాన్ మరియు హదీస్ లలో ఎక్కడా ఆధారాలు లేవు, దీనిని బిదాత్ గ పరిగణించడం జరిగింది.

786 బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ గా ఎలా మారింది

అరబీ యొక్క పదాలకు ఒక్కక్క పదానికి ఒక్కక నంబర్ ఇవ్వడం జరిగింది, ఆ విధంగా బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ కు కూడా నంబర్ లు ఇచ్చి వాటిని మొత్తం కలిపితే వచ్చేదే 786 గా పరిగణించడం జరిగింది. ఇది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే ఖురాన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు "లాముబద్దిల లి కలిమాతిల్లాహ్" అంటే అల్లాహ్ యొక్క పదాలను ఎవరు మార్చలేరు, మార్చకూడదు కూడా.




بِسْمِ اللهِ الرَّحْـمٰنِ الرَّحِيمِ

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

అనంత కరుణామయుడూ, అపారకృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

ఆయతుల్ కుర్సీ
దివ్య ఖురాన్ లోని ఎంతో ఘనత గల ‘‘ ఆయతుల్ కుర్సీ’’ అనబడే ఈ క్రింది వాక్యాన్ని ఉదయం, సాయంత్రం పఠించడం వలన ప్రయోజనలు :
ఉదయం పూట ఆయతుల్ కుర్సీ పఠించిన వ్యక్తి సాయంత్రం వరకు జిన్నాతుల బారి నుండి సురక్షితంగా ఉంటాడు.అలాగే సాయంత్రం పూట దీన్ని పఠించిన వ్యక్తి ఉదయం వరకు అల్లాహె రక్షణలో ఉంటాడు. (హాకిమ్ : 1/562) 

  اللّهُ لاَ إِلَـهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاء وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلاَ يَؤُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ  యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము  మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా  య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం (ఖుర్ ఆన్ 2:255).



అల్లా  తప్ప దాస్యానికి అర్హుడు ఎవరూ లేరు . ఆయన ఎల్లప్పుడు సజీవుడుగా వుంటాడు. ఆయన అందరినీ  ఆదుకునే వాడు . ఆయనకు నిద్ర, కునుకూ రావు . భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే . ఆయన ఆజ్ఞ లేనిదే సిఫారసు  చేసేవారు ఎవరున్నారు ?  సృష్టికి పూర్వం, తర్వత ఏమున్నదో ఆయనకు తెలుసు. ఆయన కోరిన మేరకు తప్ప ఆయన జ్ఞానం నుండి వారు ఏమి గ్రహించలేరు . ఆయన పీటం భూమి ఆకాశాలను ఆవరించి వుంది . ఆ రెండింటి సంరక్షణ ఆయనకు అలుపు తెప్పించదు . ఆయన అందరికన్నా ఉన్నతుడు మరియు గొప్పవాడు .

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget